జై భీమ్ టీవీ - జాతియం / : కర్నాటకలో పులి గోళ్ల కలకలం. ఎవరు పులి గోళ్ళు వేసుకుని తిరుగుతున్నా అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక సెలబ్రిటీకీ తప్పలేదు ఈ పులిగోళ్ల తిప్పలు. మరికొందరు సినిమా స్టార్లు, పొలిటికల్ పెద్దలు సైతం.. పులిగోరును చూస్తేనే వణికిపోతున్న పరిస్థితి. ఒకవేళ మెళ్లో పులిగోరు ఉన్నా.. తీసి భద్రంగా బీరువాల్లో దాచుకోవడమో.. లేక పోలీసులకు అప్పగించడమో చేస్తున్నారు. అంతే తప్ప దాన్నేసుకుని ఎక్కడా ఊరేగే ప్రయత్నాలు మాత్రం చెయ్యడం లేదు. అసలేమిటీ పులిగోరు కథాచిత్రం.. కర్నాటకలో ఎందుకిది క్రైమ్ కహానీగా మారింది? ఇంకా ఎవరెవర్ని కార్నర్ చేస్తోంది..? పులిగోరు అనేది నిన్నటిదాకా ఆభరణం. కానీ.. దాన్ని ధరిస్తే ఇప్పుడు పెద్ద అపరాధం. మెళ్లోనే కాదు.. ఎవరెవరి ఇళ్లల్లో పులిగోర్లు ఉన్నాయి అంటూ స్పెషల్‌గా భూతద్దాలు పట్టుకుని సెర్చాపరేషన్ మొదలుపెట్టింది కర్నాటక ప్రభుత్వ అటవీశాఖ. మొన్నీమధ్యే కన్నడ బిగ్‌బాస్ హౌస్‌లో వర్తుర్ సంతోష్ అనే సెలబ్రిటీని అరెస్ట్ చెయ్యడంతోనే మొదలైంది ఈ పులిగోరు టెర్రర్. మెళ్లో ఆరేడు తులాల బరువున్న ఆ పులిగోరును చూసి.. బిగ్‌బాస్ హోస్ట్ సుదీప్ కూడా ఫిదా అయ్యారు. షోలోకి ఎంట్రీ ఇచ్చిన వర్తుర్ సంతోష్.. ఆ పులిగోరుతోనే పాపులర్ అయ్యాడు. కానీ.. ఆ పాపులారిటీనే అతడి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. పులిగోరు ధరించడం నేరం.. ఆ మాత్రం తెలీదా అంటూ అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. మొన్నటిదాకా పాడి-పంట చేసుకుని చిన్నసైజ్ బిజినెస్‌మెన్‌గా మారి.. బిగ్‌బాస్‌తో సెలబ్రిటీ హోదా వచ్చిందని సంబరపడేలోగానే.. అతగాడి లైఫ్ ఇలా టర్న్ తీసుకుంది. దయచేసి.. నా బిడ్డను వదిలిపెట్టండి.. అంటూ లబోదిబోమంటోంది సంతోష్ తల్లి. కానీ.. అతడి మెడలో బంగారు గొలుసుకు వేళ్లాడుతున్న ఆ పులిగోరును నిశితంగా పరిశీలించాం.. పరీక్షకు కూడా పంపాం.. అది పక్కా ఒరిజినల్ పులి పంజానే.. అంటూ తేల్చేశారు బెంగళూరు అర్బన్ ఫారెస్ట్ కన్‌జర్వేటర్లు. ఒక్క వర్తుర్ సంతోష్‌తోనే ఆగిపోలేదు కర్నాటకలో పులిగోరు వ్యవహారం. ప్రముఖుల్ని వెంటాడుతూనే ఉంది పులిగోరు టెర్రర్. నటుడు దర్శన్, జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి, బీజేపీ ఎంపీ జగ్గేష్, ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేశ్, జ్యోతిష్యుడు వినయ్ గురూజీ.. ఇలా అన్ని కార్నర్స్ నుంచి సెలబ్రిటీల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీళ్లంతా పులిగోళ్లు ధరించినప్పటి వీడియోల్ని చూసి ఫారెస్ట్ అధికారులు.. సిన్సియర్‌గా డ్యూటీలో దిగేసి యాక్షన్ పార్ట్ మొదలుపెట్టేశారు. రెండేళ్ల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో పులిగోరుతో కనిపించారు ఎంపీ జగ్గేష్. తన బిడ్డ పులిలా పెరగాలన్న ఆశతో తల్లి ఇచ్చిన కానుక అని ఆ ఇంటర్వ్యూలోనే చెప్పుకున్నారు జగ్గేష్. మఖ్యమంత్రి తనయుడు, కథానాయకుడు నిఖిల్ కుమారస్వామి ఐతే.. నా మెళ్లో పులిగోరు అసలీ కాదు నకిలీ… ఎవరో గిఫ్టుగా ఇస్తే వేసుకున్నా అంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు. ఇది సింథటిక్ పులిగోరు అంటూ మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం కుమారస్వామి. అటు… కన్నడ హీరో దర్శన్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీల ఇళ్లల్లో సోదాలు చేశారు అధికారులు. కొందరైతే తమ దగ్గర పులిగోర్లుంటే స్వచ్ఛందంగానే పోలీసులకు అప్పగిస్తున్నారు. పులిగోరు ఎవరైనా వేసుకోవచ్చా.. జాతకపరంగా దీనికున్న స్పెషాలిటీ ఏంటి.. అని అందరూ ఆరా తీయడం మొదలైంది. సింహరాశి వారు, సింహలగ్నంలో పుట్టినవాళ్లు మాత్రమే పులిగోరు వేసుకుంటే మంచిదన్నది ఒక విశ్వాసం. అటు.. పులిగోరు వేసుకోవడం రాజస లక్షణమే కాదు ఆరోగ్యకరం కూడా అంటూ రకరకాల కారణాలు చెబుతారు. కానీ… పులులను వేటాడ్డం చట్టరీత్యా నేరం. పులికి సంబంధించిన శరీర భాగాల్ని కలిగి ఉన్నా నేరమే. 1972 నాటి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అది శిక్షార్హం కూడా. అందుకే.. వంశ పరంపరగా తాతముత్తాతల కాలం నుంచి సంక్రమించిన పులిగోరు ఆభరణం ఇంట్లో ఉంటే.. భేషుగ్గా మెళ్లో వేసుకోవచ్చు. అది కూడా.. సదరు పులిగోరు తమ హయాంలోనిది కాదని రుజువు చేసుకునే అవకాశం ఉంటేనే. కొత్తగా మాత్రం పులిగోరును ఆభరణంగా చేయించుకునే ప్రయత్నాలు వద్దేవద్దు అని సిద్ధాంతులే స్వయంగా సెలవిస్తున్నారు. పైగా, ఫారెస్టోళ్లతో పెట్టుకోవద్దు సుమీ అనే సలహాలు సెలబ్రిటీలకు కొత్తగా వినిపిస్తున్నవీ కాదు. జింక మాంసం తిన్నారన్న అభియోగాలతో బాలీవుడ్‌లో పెద్దపెద్ద సూపర్‌స్టార్లే ఊచల్లెక్కపెట్టేదాకా వెళ్లింది వ్యవహారం. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ జైలు వార్తల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు కర్నాటక వంతొచ్చింది. జింకతోనే అంతంత లొల్లవుతుంటే.. ఇది పులితో వ్యవహారం. మరి ఫారెస్టోళ్లు ఊరికే వదిలిపెడతారా..? క్రమంగా ఈ పులిగోరు వ్యవహారం జాతీయస్థాయి వార్త కావడంతో.. మిగతా రాష్ట్రాల్లో కూడా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమైనా కావొచ్చు. మరి.. పులిగోరు సెలబ్రిటీలు జర భద్రం మరి.
Admin