జై భీమ్ టీవీ - జాతియం / : రెచ్చగొట్టే ధోరణిని దాయాది దేశం పాక్ కొనసాగిస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని ఆర్నియా సెక్టార్‌లో గురువారం సాయంత్రం జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్ జవాన్ సహ ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పాక్ వైపు నుంచి గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన కాల్పులు శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగాయి. అంతర్జాతీయ సరిహద్దులకు సంబందించి భారత్, పాక్ మధ్య 2021 ఫిబ్రవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే మొదటిసారి. నివాస ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాక్ కాల్పులు జరపడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారత్ కూడా పాక్ చర్యలకు దీటుగా జవాబు చెప్పింది. కాల్పుల కారణంగా రాత్రంతా బిక్కుబిక్కుమంటు గడిపామని సరిహద్దు గ్రామాల ప్రజలు తెలిపారు. కాల్పుల ఆగిన వెంటనే చాలా మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆర్నియా సెక్టార్‌లోని సరిహద్దుల వెంట సైన్యం, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టిన కాసేపటికే పాక్ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. వారం క్రితం కూడా పాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు గాయపడ్డారు. అయితే BSF స్థానిక కమాండర్లు, పాక్ రేంజర్స్ మధ్య వెంటనే సమావేశం జరగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను విద్యుత్ బల్బులను స్విచ్ ఆఫ్ చేసి ఇంటి లోపలే ఉండాలని BSF ఆదేశించింది. అర్నియాతో సహా సరిహద్దు ప్రాంతాలలో కూడా హై అలర్ట్‌లో ఉంచారు. సరిహద్దుకు వెళ్లే అన్ని రహదారులపై పోలీసులు బారికేడ్లు వేసి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. బయటకు వచ్చిన ప్రజలను ఇళ్లకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కాల్పుల్లో పాకిస్థాన్‌కు కూడా భారీ నష్టం వాటిల్లిందని ఐబీ తన నివేదికలో పేర్కొంది. భారత కాల్పుల్లో ఐదు నుంచి ఆరుగురు సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. కాల్పులు చాలా భారీగా జరుగుతున్నాయని అర్నియాలో భయాందోళనకు గురైన స్థానికులు తెలిపారు. అందరూ భయపడుతున్నారు. ప్రజలు బంకర్లలో దాక్కున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇది ప్రతి నాలుగు-ఐదు సంవత్సరాలకు జరుగుతుంది. అందరూ తమ ఇళ్లలో దాక్కుంటారు. ఇక్కడికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే సరిహద్దు ఉంది.
Admin