జై భీమ్ టీవీ - జాతియం / : తృణ ధాన్యాల ప్రాధాన్యత, లాభాలను వివరిస్తూ ఈ ఏడాద జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పాట విడుదల చేశారు. ప్రముఖ ఇండో – అమెరికన్ గాయని ఫాల్గుణి షాతో కలిసి ఈ పాటను రాయడమే కాకుండా తన గొంతును కూడా అందించారు ప్రధాని. అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పేరుతో హిందీతో పాటు ఇంగ్లిష్ భాషల్లోనూ ఈ పాట విడుదలైంది. పాటలో భాగంగా మోడీ స్వయంగా పలికిన మాటలు ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను ఎలా నిర్మూలించవచ్చు అన్నది ఈ పాట రూపంలో తెలియజేశారు ప్రధాని మోడీ, ఫాలు దంపతులు. తాజాగా ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కారానికి నామినేట్ అయ్యింది. కాగా 2022లోనే ఫాల్గూణి షాకు గ్రామీ అవార్డు వరించింది. ఈ సందర్భంగానే ఫాల్గుణి షా, ఆమె భర్త గౌరవ్ షా స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సమయంలోనే ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటకు పునాది పడింది. మనుషుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సంగీతానికి బలమైన శక్తి ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి నిర్మూలన సమస్య కోసం ఒక పాట రాయాలని ప్రధాని మోడీ ఫాల్గుణి షా దంపతులకు సూచించారట. అప్పుడే తృణ ధాన్యాలపై ప్రత్యేక గీతాన్ని రూపొందించాలని ఫాల్గుణి షా డిసైడ్ అయ్యారట. అయితే తమ పాటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా భాగం చేయాలనుకున్నారట ఫాలూ దంపతులు. ‘తృణ ధాన్యాలపై పాటలో మోడీని భాగం చేయాలని మేం అనుకున్నాం. అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ప్రధానితో కలిసి పాట రాసేందుకు మొదట మేం భయపడ్డాం. అయితే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం. పాట మధ్యలో ప్రధాని కొన్ని మాటలు మాట్లాడతారని, ఈ సాంగ్‌కు అవే ప్రత్యేకాకర్షణగా నిలిచాయి’ అని అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ సాంగ్ రిలీజ్ సందర్భంగా చెప్పుకొచ్చారు ఫాల్గూణి షా దంపతులు. కాగా ఐక్యరాజ్య సమితి 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ప్రతిపాదనే ఇందుకు ప్రధాన కారణం.
Admin